'హమారా బజాజ్‌' అంటూ మన మనసుల్ని కట్టిపడేసిన ఆనాటి చేతక్‌ స్కూటర్‌ వాణిజ్య ప్రకటనని మనం ఎలా మర్చిపోగలం? అదే పేరుతో బజాజ్‌ అర్బనైట్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రూపొందించింది. ఇకపోతే దేశీ టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్లకు డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. మరీ ప్రత్యేకించి పట్టణాలు, నగరాల్లోని వాహన ప్రియులు మోటార్‌సైకిల్స్ బదులు స్కూటర్ల కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది.


ఓవైపు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు కంపెనీల మధ్య పోటీ కూడా తీవ్రమౌతోంది. ఈ సందర్భంగా స్వదేశీ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల విభాగంలో తక్కువ ధరతో లభించే ఉత్పత్తుల కంటే అర్బనైట్ ఉత్పత్తులు చాలా విభిన్నంగా ఉండనున్నాయి. ప్రస్తుతం అమ్ముడయ్యే టూ వీలర్ల ప్రయాణ పరిధి చాలా తక్కువగా ఉంది, మరియు వీటి పర్ఫామెన్స్ కూడా తక్కువే. ఈ రెండు సవాళ్లను అధిగమించేలా అర్బనైట్ ఉత్పత్తులు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


ఈ బజాజ్ కంపెనీ తీసుకువచ్చే అర్బనైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పేరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ కావొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ టెస్టింగ్ సమయంలో  కెమెరాల కంటికి చిక్కింది.ఇలాగే గతంలోనూ ఒకసారి బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. ఈ లీకైన ఫోటోలను గమనిస్తే ఈ స్కూటర్ అదిరిపోయే డిజైన్‌తో కస్టమర్లకు ఆకట్టుకునేలా ఉందని అర్ధం అవుతుంది. అయితే బజాజ్ కంపెనీ అక్టోబర్ 16న ఈ స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయబోతోందని, ఇప్పటికే ఇన్విటేషన్లు కూడా పంపిందని. ఈ లాంచ్ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వంటి వారు  పాల్గొననున్నారని తెలుస్తుంది.


ఆ రోజే ఈ స్కూటర్‌కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడవుతాయంటున్నారు. ఇకపోతే ఈ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్స్ వంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది. ఈ స్కూటర్ హోండా యాక్టివా 6జీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు. దీని ధర రూ.80,000 నుంచి రూ.లక్ష మధ్యలో ఉండొచ్చనే అంచనాలున్నాయని అనుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: