గతేడాది సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని  పలువురు రివ్యూ పిటిషన్లు న్యాయస్థానంలో దాఖలుచేశారు. దీనిపై విచారణ చేసి, దాని తుది తీర్పును గురువారం వెల్లడించింది. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు 7 గురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీచేసింది. 


అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా..? వద్దా..? అనే అంశాన్ని తేల్చడానికి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో మళ్ళి శబరిమల వివాదం మొదటికొచ్చింది. శబరిమలలో మండల పూజలకు ఆలయం మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్న వేళ స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే సర్వత్రా ఉత్కంఠ రేకెత్తుతున్నాయి. శబరిమలలో శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా కాపాడుకుంటామని అయ్యప్ప ధర్మసేన ప్రకటించింది.


జనవరి.2.2019 న ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అయ్యప్ప భక్తులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన తర్వాత కేరళలోని వివిధ హిందూ సంస్థలతో కూడిన శబరిమల కర్మ సమితి మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అటు కేరళ ప్రభుత్వం.. ఇటు అయ్యప్ప భక్తులు వెనక్కు తగ్గకపోవడంతో కేరళ రణరంగాన్ని తలపించింది.


తాజాగా, ఆలయం తెరుచుకోనుండగా మళ్లీ ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందా..? భక్తుల మనోభావాలను గౌరవిస్తుందా..? చూడాలి మరి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీం తీర్పును అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు ప్రకటించాయి. అయ్యప్ప సన్నిధానంలో 10 వేల మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. వీరిలో 300 మంది వరకు మహిళా పోలీసులు కూడా ఉండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: