చూడగానే మంచి నగు మోముతో పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది లయ. ఆమె నటించిన చిత్రాలలో అభినయం ఏమాత్రం అతిగా అనిపించదు. సహజంగా పాత్రల్లో జీవిస్తూ ఉంటుంది. ఎన్నో చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి అచ్చమైన తెలుగమ్మాయి అనిపించుకుంది. గ్లామర్ షో లేకపోయినా ఇండస్ట్రీలో సాంప్రదాయకమైన పాత్రలతోనే అద్భుతంగా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈరోజు లయ పుట్టినరోజు.

1982 అక్టోబర్ 21న పదహారణాల తెలుగమ్మాయి గా తెలుగు కుటుంబంలో విజయవాడలో జన్మించింది లయ. ఆమె తల్లి సంగీతం టీచర్ కాగా, తండ్రి డాక్టర్. లయ తల్లి విజయవాడలో పని చేస్తున్న స్కూల్లోనే లయ హై స్కూల్ చదువు పూర్తి చేసింది. అప్పట్లో చెస్ లో ఆమె మంచి ప్రతిభను చూపించేది. చదువుకునే రోజుల్లోనే చెస్ లో లయ ఏడు సార్లు స్టేట్ చాంపియన్ గా నిలిచింది. ఒకసారి నేషనల్ లెవెల్ లో ఆడి రన్నరప్ గా రెండో స్థానంలో నిలిచింది. ఇక అప్పట్లోనే డాన్స్ లో ఆరితేరిన లయ దాదాపు 50 నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

1999 లో వచ్చిన 'స్వయంవరం' చిత్రంతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. వేణుతో ఆమె చేసిన మొదటి చిత్రమే అద్భుతమైన విజయం సాధించింది. దీంతో లయకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు రావడం మొదలైంది. మనోహరం, దేవుళ్ళు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్రాల్లో నటించిన లయ అన్నింట్లోనూ అభినయానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. 2000 లో మనోహరం, 2001లో ప్రేమించు చిత్రాలకు ఉత్తమ నటిగా ఆమె నంది అవార్డును సైతం అందుకున్నారు. నటిస్తూనే కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె 2006లో శ్రీ గణేష్ గొర్తిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు పాప, బాబు ఉండగా అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నారు లయ.


మరింత సమాచారం తెలుసుకోండి: