ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణ లో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. సోమవారం రాత్రి 4,300 మెగా వాట్స్ డిమాండ్ ఉండగా.. మంగళవారం మధ్యాహ్నానికి 3,800 మెగా వాట్స్​కు పడిపోయింది. రాత్రి 10:30 గంటల సమయంలో 3,100మెగావాట్లకి విద్యుత్ డిమాండ్ పడిపోయిందని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగా విద్యుత్ డిమాండ్ 12వేల మెగావాట్లు ఉంటుంది. కానీ భారీ వర్షాలతో వినియోగం బాగా తగ్గింది. రాత్రి సమయంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్​ల వినియోగంతో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థల విద్యుత్ వినియోగం భారీగా తగ్గుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.


రాత్రంతా ఎడతెరిపిలేని వర్షాలు కొనసాగితే 3వేల మెగావాట్ల నుంచి 2,800ల మెగావాట్లకు విద్యుత్ తగ్గిపోయే అవకాశం ఉందని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు. అన్ని గ్రిడ్​లలో అధికారులను అప్రమత్తం చేశామని వివరించారు. డిమాండ్​లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత తగ్గినా దాన్ని ఎదుర్కొనే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. 24 గంటల పాటు సీఈ, ఎస్​ఈలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. ములుగు, భద్రాద్రి ప్రాంతంలో మినహా పెద్దగా విద్యుత్ అంతరాయం లేదన్నారు. అక్కడ వృక్షాలు కుప్పకూలడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: