ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు అంశంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని... పైగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న రఘురామ కృష్ణంరాజు వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.. అంటూ సాక్షి పేరు మీదు ఉన్న ట్వీట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ వెలిసింది. అది కూడా ఉదయం 10 గంటల 53 నిమిషాలకే. దీనిపైనే ఆర్ఆర్ఆర్ ఈ రోజు ఘాటుగా వ్యాఖ్యానించారు. తీర్పు రాకముందే... వాళ్లకు ముందే ఎలా తెలిసింది అని ప్రశ్నించారు. కోర్టు ఏమైనా వారికి మాత్రమే ఫోన్ చేసి చెప్పారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థపై గౌరవం పోతుందన్నారు రఘురామ కృష్ణంరాజు. బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రాకముందే ఇలాంటి తప్పుడు పోస్టులు ఎలా చేస్తారని కూడా రఘురామ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: