బద్వేల్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయ‌బోతున్న‌ట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ ప్ర‌క‌టించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌టానికి  ప్రజల్లోకి వెళుతున్నామని స్ప‌ష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామని, దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని తేల్చిచెప్పారు. రాష్టంలో పరిపాలన రోజు రోజుకీ దారుణంగా మారుతోందని, అప్పుల బాధతో ప్రభుత్వం తలమునకల‌వుతోంద‌ని,  రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని మండిప‌డ్డారు. బీజేపీని ప్రశ్నించలేని అసమర్థతలో ఏపీ ప్రభుత్వం ఉందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆపాలంటే.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ముడిప‌డిన సంస్థ‌ల‌ను కూడా కేంద్రం ప్ర‌యివేటీక‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని, దాన్ని కాంగ్రెస్ పార్టీ  అడ్డుకుంటుంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: