గేయ రచయిత, జన నాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగు ప్రహ్లాద్ కొద్దిసేప‌టి క్రితం మృతి చెందారు. హైదరాబాదు లోని నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ ప్ర‌హ్లాద్ మ‌ర‌ణించారు. ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో  ప్రహ్లాద్ తీవ్రంగా గాయపడ్డారు. అప్ప‌టినుంచి ఆయ‌న నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విష‌మించ‌డంతో ఈ ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ప్రజా కవి గా, జన నాట్య మండ లి లో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించ‌డంతోపాటు త‌న‌వంతు చేయూత‌గా రాష్ట్ర‌మంతా ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌జ‌ల‌కు త‌న పాట‌ల రూపంలో తెలియ‌ప‌రిచారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం కు చెందిన జంగు ప్ర‌హ్లాద్ హైదరాబాదు లోని జగద్గిరిగుట్ట లో నివాసం ఉంటున్నారు. ప్ర‌హ్లాద్ మృతిపై ప‌లువురు క‌ళాకారులు, రాజ‌కీయ‌నేత‌లు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేశారు. తెలంగాణ ఉద్య‌మానికి, ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ప్ర‌హ్లాద్ కుటుంబానికి ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం అందేలా చూస్తామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: