అసెంబ్లీలో ఈటెల రాజేంద‌ర్‌ను చూడొద్ద‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం ప‌ట్టార‌ని హుజూరాబాద్ నుంచి భార‌తీయ జ‌న‌తాపార్టీ అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్న ఈటెల అన్నారు. ఈరోజు ఉద‌యం ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ పోలీసుల‌ద్వారానే డ‌బ్బులు పంపిణీ చేయించింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు డ‌బ్బులు అంద‌లేద‌ని బ‌హిరంగంగా అడుగుతున్నార‌ని, ఇది ప్ర‌జాస్వామ్యానికి మాయ‌నిమ‌చ్చ‌లాంటిద‌న్నారు. త‌న‌ను ఓడించ‌డానికి అధికార యంత్రాంగంతో కేసీఆర్ స‌ర్వశ‌క్తులు ఒడ్డుతున్నార‌ని, ప్ర‌జ‌లంతా దీన్ని ఎదుర్కోపోతే స‌మాజం బానిస‌త్వంలోకి వెళ్లే ప్ర‌మాదం క‌న‌ప‌డుతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లంతా ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటూ ధ‌ర్మాన్ని నిల‌బెట్టాని కోరారు. హుజూరాబాద్ పోలీసులే స్వ‌యంగా ర‌క్ష‌ణ క‌ల్పించి అధికార పార్టీ డ‌బ్బుల పంపిణీ స‌జావుగా సాగేలా చూశార‌ని, ఇంత‌కంటే ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సంఘ‌ట‌న‌లు ఎక్క‌డా లేవ‌న్నారు. క‌మ‌లాపూర్‌లో ఈటెల రాజేంద‌ర్ త‌న ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ర‌ఫున గెల్లు శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, కాంగ్రెస్ త‌ర‌ఫున బి.వెంక‌ట్ పోటీప‌డుతున్నారు. ఒక‌టోతేదీన ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: