కారుణ్య నియామకాల ప్రక్రియను  న‌వంబ‌ర్‌ 30లోపు  పూర్తి చేయాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వుల‌ను జారీ చేసారు.  కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది.  విధి, విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు త‌మ ప‌రిధిలోని అర్హులైన వారి ధ‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించేందుకు ఈనెల 20వర‌కు పూర్తి చేయ‌నున్నారు.  న‌వంబ‌ర్ 23 వ‌ర‌కు జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్‌ సెలక్షన్‌ కమిటీలు  పూర్తి చేస్తాయి. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్‌ పోస్టులకు ఎంపికను రీజనల్‌ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని ఎండీ తిరుమ‌ల‌రావు వెల్ల‌డించారు.

ఎంపికైన వారికి న‌వంబ‌ర్ 27 లోపు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.  ముఖ్యంగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు,  డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ ఉద్యోగాలకు రీజనల్‌ మేనేజర్లు ఈనెల 30 వ‌ర‌కు నియామక ఉత్తర్వులు జారీ చేస్తారని వివ‌రించారు. ఆ తరువాత శిక్షణ తరగతులు కూడ  నిర్వహిస్తారు.  కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్నారు. అయితే  క్లాస్‌–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్‌ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్‌ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా  అంద‌జేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: