బంగాళాఖాతంలో వాయుగుండం ఇవాళ‌ తీవ్ర తుఫానుగా మారనున్న‌ది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన‌ది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం క‌నిపిస్తోంద‌ని..  ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ఓ అంచెనా వేసారు. ఈ తుఫాన్‌కు ఇప్ప‌టికే అధికారులు జవాద్ అని పేరు కూడా పెట్టారు. జవాద్ తుఫాన్  తో  ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో నే బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.

జవాద్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయ‌ని, వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించిన‌ది.  శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి చ‌ల్ల‌ని  ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సోమవారందాకా చేప‌ల‌ వేటకు వెళ్ల‌వ‌ద్ద‌ని..  సూచించారు. మరోవైపు జవాద్ తుఫాన్  సంద‌ర్భంగా విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసారు.  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 3, 4 తేదీల‌లో స్కూళ్లకు సెలవులు ఉంటాయని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  ఆ త‌రువాత‌ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు క‌లెక్ట‌ర్‌. తుఫాన్ ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో కూడా ఇవాళ‌, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: