బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతున్న‌ది.  వాయుగుండం కాస్త  తుపాన్‌గా బలపడనున్న‌ది.  సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఆవ‌రించి ఉంది.  

దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం కృష్ణ‌దాస్ ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. జవాద్ తుఫాన్ రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, 11 తీర ప్రాంత మండలాల్లో ప్రభావం ఉండవచ్చని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఎన్. డి.ఆర్.ఎఫ్, ఎస్.డి. ఆర్.ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని, తుఫాన్ అనంతర చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారుల‌కు సూచించారు.  తాగునీరు,  విద్యుత్ పునరుద్ధరణ పై సన్నద్ధంగా ఉండాలని, కంట్రోల్ రూమ్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామ‌ని, ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం కృష్ణ‌దాస్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: