వారిద్ద‌రూ  కలిసి మెలిసి కొద్దిరోజులు గ‌డిపారు.  ప్రాణ స్నేహితులు కావ‌డంతో అన్నింటా ఒక్కటై మెలిగారు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలో ఉన్న‌ట్టుండి  కరోనా మహమ్మారి ప్రవేశించింది. అందులో ఒకరిని బలిగొన్న‌ది. నువ్వు లేని ఈ జీవితంలో నేను ఉండలేనంటూ మరొక‌ మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకున్న‌ది. మెండోరా మండలం పోచంపాడ్‌లో నివాసం ఉండే తిమ్మాన్‌పల్లి శ్రీనివాస్‌ (31), కంచు రవి (31) స్నేహితులు. కాలనీలో డెయిరీ ఫాం పెట్టుకుని పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

శ్రీనివాస్‌ 15 రోజుల క్రితమే కరోనాతో మృతి చెందాడు. దీంతో రవి రోజు రోజుకు మానసికంగా కుంగిపోయాడు.వారం రోజుల క్రిత‌మే   రెండు చేతులను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అప్పటి నుంచి రవిని ఒంటరిగా వదిలేయకుండా కుటుంబసభ్యుల కోరిక మేరకు కొందరు మిత్రులు తమ వెంట తిప్పుకుంటున్నారు. అయినప్పటికీ రవి మానసిక స్థితిలో మాత్రం మార్పురాలేదు. తాను ఎప్పటికైనా తన స్నేహితుడు శ్రీనివాస్‌ వద్దకు వెళ్తానని వారితో ఎప్పుడూ చెప్పేవాడు. తాజాగా రవి  ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌ల‌మే రేకెత్తిస్తుంది. మ‌రొక విష‌యం ఏమిటంటే.. స్నేహితుని ప‌క్క‌నే పూడ్చాల‌ని అత‌ను సూసైడ్ నోట్‌లో రాయ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: