రాష్ట్రపతి ఎన్నికల సందడి జోరందుకుంది. నిన్న రాత్రి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళ ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇప్పుడు ద్రౌపది ముర్ము గురించి దేశమంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తం 20 పేర్లపై ఎన్డీఏ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలని నిర్ణయించిన తర్వాత ద్రౌపది ముర్ము పేరు చర్చకు వచ్చిందట.

ఈసారి మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇక ఈ ద్రౌపది ముర్ము ఎవరంటే.. ఆమె గతంలో ఓ ఒడిశా టీచరమ్మ. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు కూడా తీసుకున్నారు. ఆమె బాల్యం నుంచి సంఘ్‌ పరివార్‌తో సన్నిహితంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. విద్యాభ్యాసం తర్వాత సేవారంగంలో ప్రవేశించి మయూర్‌భంజ్‌ ఆదివాసీల హితం కోసం ముర్ము ఉద్యమించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: