ప్రధాని సొంత రాష్ట్రంలో కల్తీ సారా మాఫియా రెచ్చిపోతోంది. గుజరాత్ లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బోటాడ్ జిల్లాలో ఇప్పటి వరకు 25 మంది వరకూ కల్తీ సారాతో మరణించారు. అహ్మదాబాద్ జిల్లాలో మరో ఆరుగురు కల్తీ సారాతో మరణించారు. భావ్ నగర్, బోటాడ్, బర్వాలాలోని ఆసుపత్రుల్లో 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

కల్తీ మద్యం తయారు చేస్తున్న బోటాడ్ జిల్లాకు చెందిన ముగ్గురిని ఇప్పటివరకూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోటాడ్ జిల్లా రోజిద్ గ్రామంలో కొందరితోపాటు... ధందుక, భావ్ నగర్ ప్రాంతాల్లో మరికొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. మరణాల సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ ప్రభుత్వం విచారణకు సిట్ ఏర్పాటును ఆదేశించింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం, అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: