ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులోని నలుగురిని నిందితులుగా చేరుస్తూ మెయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేరుస్తూ గత నెల 22వ తేదీన మెయినాబాద్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. తుషార్, జగ్గుస్వామిను అరెస్ట్ చేయడానికి వారెంట్ ను కూడా దాఖలు చేశారు.


ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, రాంచంద్ర భారతి వాట్సప్ సంభాషణలు జరిపారని... ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దురుద్దేశంతో కుట్రపన్నారని పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ వాదనలు కోర్టులో వాదించారు. అక్టోబర్ 28వ తేదీన రాంచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి స్వామిజీలను అరెస్ట్ చేసి వాళ్ల సెల్ ఫోన్ లను పరిశీలించినప్పుడు కీలక విషయాలు బయటికొచ్చినట్లు కోర్టుకు తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, ఏపీ, మధ్యప్రదేశ్ లోనూ ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే.. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు.  ఏసీబీ ప్రత్యేక కోర్టు మాత్రం పోలీసుల మెమోను కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: