ఏపీఎస్ ఆర్టీసీ ఇకపై ప్రతి ఇంటి తలుపు తట్టనుంది. కరోనా కారణంగా ఆర్టీసీ సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బస్సులన్ని దాదాపు మూడు నెలల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. ఒక దశలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా సంస్థ ఇబ్బందులు పడింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి సంస్థను ఒకే ఒక్క విభాగం గట్టెక్కించింది. అదే లాజిస్టిక్. గతంలో ఏఎన్ఎల్ పార్సిల్ ద్వారా కొరియర్ సర్వీసులు నిర్వహించిన ఆర్టీసీ... దాదాపు ఐదేళ్లుగా తానే సొంతగా ఈ విభాగాన్ని నిర్వహిస్తోంది. కొరియర్ ద్వారా బుక్ చేసుకున్న పార్శిల్ ను ప్రైవేటు సంస్థల కంటే ముందే వినియోగదారులకు అందించడంతో పాటు సురక్షితంగా కూడా సరఫరా చేస్తోంది. దీంతో ఆర్టీసీ కొరియర్ సర్వీసుకు డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం బస్టాండ్ టూ బస్టాండ్ మాత్రమే సర్వీసు చేస్తున్న ఆర్టీస్ కొరియర్... ఇకపై నేరుగా ఇంటికే లభించనున్నాయి.

ఆర్టీసీ కొరియర్ సర్వీసును మరింత విస్తృతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై వినియోగదారులు బుక్ చేసుకున్న పార్శిల్ ను నేరుగా వారి అడ్రస్ కే అందివ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ అదనపు రుసుం వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుం కేవలం ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే. అయితే ఇంటికి నేరుగా చేరుకోవాలంటే మాత్రం ఇకపై ఒక కేజీ బరువుకు 15 రూపాయలు, ఒకటి నుంచి ఆరు కేజీల బరువున్న వస్తువులకు 25 రూపాయలు, ఆరు నుంచి 10 కేజీల బరువున్న పార్శిల్ కు అయితే 30 రూపాయల రుసుంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి.. అంటే రేపటి నుంచే ప్రారంభించనుంది ఆర్టీసీ సంస్థ. అయితే తొలిదశలో నగరాల నుంచి పది కీలోమీటర్ల పరిధిలో మాత్రం డోర్ డెలివరీ ఉంటుందని... ఈ ప్రయోగం విజయవంతమైతే... రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామంటున్నారు అధికారులు. కొరియర్ సర్వీసు, లాజిస్టిక్ కోసం ఇప్పటికే పాత బస్సులను లగేజ్ పార్శిల్ వ్యాన్లుగా ఆర్టీసీ మారుస్తోంది. సంస్థ ఆదాయంలో దాదాపు 40 శాతం లాజిస్టిక్ సర్వీసు ద్వారానే ప్రస్తుతం లభిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: