టేకు సిరులు కురిపించే పంట. బంగారానికి సరిసమానమైన ఈ కలప తో తయారు చేసిన ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు పది కాలాల పాటు పదిలంగా నాణ్యతతో అందంగా కనిపిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టేకు వనాలు పూర్తిగా తగ్గి పోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపలని ఉపయోగించుకున్న పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయం తో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి పెంచితే పర్యావరణంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు.

రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద నర్సరీలో టేకు,ఇతర మొక్కలను పెంచి రైతులకు ఉచితంగా అందిస్తోంది. ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్ళు ఇంకేలా తయారు చేసుకోవాలి . ఆరు నెలలకొకసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కలు అడుగుభాగంలో వెయ్యాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదల సక్రమంగా ఉంటుంది. 20 ఏళ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక ఘణపు  అడుగు టేకు కర్ర కు 3 వేల నుంచి 4 వేల వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెర్మిట్ ఖర్చులు పోగా  20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా. మన తెలంగాణ రైతులు బీడు భూములలో, పోడు భూములలో, పొలం ఒడ్డు పైన గాని, గట్ల పైన గాని, ఎర్ర భూములలో టేకు కలప సాగు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మొక్కల ఎదుగుదల తర్వాత టేకు  కర్ర ను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకొని చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి.

తర్వాత రేంజ్ పరిధిలోని అటవీ క్షేత్ర  అధికారి చెట్లు పట్టా భూమి లోనివా లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధ్రువీకరించుకొని చెట్లను నరికి వేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే  జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు చాలామంది గుత్తే దారులు   అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: