సహజంగా దుస్తులకు తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అదే ఇప్పుడు ట్రెండ్ అయింది. అయితే అది అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి తప్ప.. సైజులో పెద్దగా ఉండ‌కూడ‌ద‌ని అంటున్నారు నిపుణులు. అందులోను ఆఫీసుకి తీసుకెళ్లే బ్యాగ్‌ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎంపిక చేసుకునే బ్యాగ్‌ మీ శరీరాకృతికి తగ్గట్టు ఉండాలి. మరి హ్యాంగ్ బ్యాగ్ ఎంపికలో కొన్ని జాగ్రత్తలు త‌ప్ప‌కుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


హ్యాండ్ బ్యాగ్ పెద్దగా ఉంటే.. అందులో ఆఫీసుకు చెందిన వస్తువులు, పుస్తకాలతోపాటు మేకప్ సామగ్రి వంటి వాటిని ఉంచుతాం. దీంతో బరువు పెరుగుతుంది. దీన్ని భుజానికి తగిలించుకోవ‌డం వల్ల ఆ ప్రభావం భుజ‌కండ‌రాల‌పై పడుతుంది. క్రమ క్ర‌మంగా నొప్పి మొదలవుతుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రమాదమే. కాబట్టి భుజం వద్ద భరించలేనంత నొప్పి వచ్చినప్పుడు బ్యాగ్‌ను తగిలించుకోవడం క‌న్నా చేత్తో ప‌ట్టుకోవ‌డం మంచిది. లేదంటే ఆ నొప్పి నెలల తరబడి వేధిస్తుంది.


బ్యాగును ఎప్పుడూ ఒకవైపే త‌గిలించుకోకుండా మధ్యలో చేతులు మారుస్తుండాలి. అదేవిధంగా భుజాల మీదుగా వేసుకునే షోల్డర్, క్రాస్ షోల్డర్, స్లింగ్‌ రకాలనూ ఎంచుకోవచ్చు. కొందరు అన్ని రకాల వస్తువుల్ని బ్యాగులో పెట్టేస్తుంటారు. అలాంటి వారు వారానికి ఒకసారి బ్యాగ్ ను శుభ్రం చేసుకోవాలి. అనవ‌స‌ర వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయడం అలవాటుగా పెట్టుకోవాలి. దానివల్ల అన‌వసరమైన సామాను పేరుకోదు. బరువూ తగ్గుతుంది. దీంతో భుజాల నొప్పులు ఉండ‌కుండా చేసుకోవ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: