చలికాలం వచ్చిందంటే ముఖంలో ఉన్న అందమంతా ఆవిరైపోతుంది. చర్మం పొడిబారడం. దురదగా ఉండటం. పగుళ్లు ఏర్పడి చికాకు పెట్టిస్తుంది. సహజంగానే ఎవరి చర్మం అయినా శీతాకాలంలో ఇలాగే ఉంటుంది. అయితే చర్మాన్ని శీతాకాలంలో మృదువుగా, తేమగా ఉంచుకోవాలంటే అందుకు క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇక ఈ క్యారెట్‌తో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

ముందుగా సగం ముక్క క్యారెట్ తీసుకుని దాన్ని తురుం పట్టి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పాలు ఆ మిశ్రమంలో వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. తరువాత 15 నిమిషాల అలాగే ఉండనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా మారి, పగలకుండా ఉంటుంది. ఇకపోతే ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు.

 

 

ఇదే కాకుండా  క్యారెట్లు ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎలాగంటే చర్మం నుంచి విడుదలయ్యే నూనెలాంటి ద్రవాన్ని క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ బయటకు పంపుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ఇలాంటి చర్మం కోసం క్యారెట్ జ్యూస్ ఒక కప్పు తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసం ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. ఇలా చేసిన 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు.

 

 

ఇకపోతే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవాలంటే, క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్‌లను సమపాళ్లలో కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడగడం వల్ల చర్మం తాజాగా మారి, ముఖ సౌందర్యం పెరుగుతుంది.

 

 

అంతే కాకుండా సూర్యకాంతి, దుమ్ము, ధూళిల నుంచి చర్మానికి రక్షణ లభించాలంటే క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ను సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో ఆ మిశ్రమాన్ని నింపి దాన్ని సన్ ప్రొటెక్షన్ స్ప్రే గా వాడుకోవచ్చు. ఇకపోతే క్యారెట్ జ్యూస్, అలోవెరా జ్యూస్‌లను కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది. ఇక ఇలా చేసి ఈ చలికాలం నుండి మీ చర్మాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: