ప్రస్తుతకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతుంది. మరి కొంతమందికి జుట్టురాలడం, ఇంకొంతమందికి జుట్టు పొడిబారిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.ఇందుకు కారణం మనం తీసుకొనే ఆహారంలో పోషకాల లోపం అయినా ఉండొచ్చు, లేదా వాతావరణంలో కలిగే మార్పుల వల్ల, కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల త్వరగా జుట్టు తెల్లబడుతుంది. ఇందుకోసం ఎన్నో రకాల హెయిర్ కలర్స్ తెచ్చి జుట్టుకు వేసేస్తున్నారు. హెయిర్ కలర్ వేయడం వల్ల కళ్లకు,చర్మానికి ఎంతో హానికరమని తెలిసినప్పటికీ వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వీటి వల్ల తొందరగా ఫలితం వచ్చినా,  భవిష్యత్తులో మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి  చిట్కాలను పాటించి, ఎటువంటి సమస్యలు రాకుండా సహజంగా తెల్ల జుట్టును, నల్లగా మార్చుకోవచ్చు.అలాగే జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు సంరక్షణలో భాగమైన నూనె విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలను తెచ్చి జుట్టు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి జుట్టుకు సహజ రంగును అందించడంతోపాటు ఆరోగ్యంగా ఉండడానికి,గానుగలో రుబ్బిన కొబ్బరి నూనెను తెచ్చుకొని అందులో కరివేపాకు, గోరింట, మందారం, మెంతులు లాంటివి వేసి,కొబ్బరి నూనెను బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. మీ జుట్టుకు  నూనె పెట్టేముందు కొద్దిగా వేడి చేసి,గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ళకు పట్టించి, ఐదు నిమిషాల పాటు మర్దనా  చేయాలి. అయితే వారానికి మూడు సార్లు  ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, కుదుళ్లు దృఢపడతాయి. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

మార్కెట్లో దొరికే ఎన్నో రకాల రసాయనాలు కలిగిన షాంపూలు తీసుకొచ్చి,తలంటు పోసుకుంటుంటారు. ఫలితంగా జుట్టు నిర్జీవమై పొడిబారుతోంది. ఇందుకోసం వారానికి ఒకసారి గోరింట,మందారం,కరివేపాకు,పెరుగు అన్నీ కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి,ఒక గంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు షాంపూలను వాడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా,ప్రకాశవంతంగా తయారవుతుంది.


జుట్టు పెరుగుదల బాగుండాలంటే, శరీరం లోపల నుంచి పోషణ కూడా అందించాలి. అంతేకాకుండా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటుండాలి. ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువ.సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. షాంపూలను వాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: