ప్రముఖ రాజకీయవేత్త, నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి పుట్టిన రోజు నేడు. స్వతహాగా రాజకీయవేత్త అయినప్పటికీ ఆయనలో ఉన్న కళా అభిలాష సినిమా రంగం వైపు నడిపించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కళారంగంలో కళాకారులను నిత్యం అభినందించడం, అతని పేరు మీద సినీ, సాంస్కృతిక కళాకారులకు అవార్డులు అందించడం వంటి కార్యక్రమాలతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల అందరికీ ఆయన బంధువే. అందుకే ఆయనను కళా బంధు, కళా రత్న, కళా సామ్రాట్, కళా తపస్వి వంటి బిరుదులు వరించాయి.
 
1950 సెప్టెంబర్ 17న జన్మించిన సుబ్బరామి రెడ్డి కొన్నేళ్ళు కాంట్రాక్టర్ గా కొనసాగాడు. ఆయన తండ్రి బాబుల్ రెడ్డి కాంట్రాక్టర్ కావడంతో ఆయన కూడా అదే బాటలో నడిచారు. ఆ విధంగా నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి తన వంతు కృషి చేశారు. అన్ని పార్టీల నాయకులతోనూ ఆయన స్నేహ భావంతో మసలుతారు అజాత శత్రువు అని కూడా అంటారు. ఇక నెల్లూరుకు చెందిన సుబ్బరామి రెడ్డి హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఉండేవారు. అక్కినేని నాగేశ్వరరావుతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. దీంతో ఆయన నటించిన బంగారు కలలు చిత్రంలో కొన్ని క్షణాలు తెరపై మెరిసారు. ఆ తర్వాత తన కళాభిరుచిని సినిమాలు నిర్మించడంలో కొనసాగించారు. డి రామానాయుడుతో కలిసి హిందీలో 'దిల్ వాలా', తెలుగులో 'జీవన పోరాటం' సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. త్రిమూర్తులు, స్టేట్ రౌడీ, సూర్య ఐపిఎస్, గ్యాంగ్ మాస్టర్, వంశోద్ధారకుడు వంటి చిత్రాలను నిర్మించి సూపర్ హిట్స్ అందుకున్నారు. సంస్కృతంలోనూ 'భగవద్గీత' అనే చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు.

సుబ్బరామిరెడ్డి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1998 లో ఎన్నికయ్యారు. 2002, 2008, 2014 వరుసగా రాజ్యసభకు సుబ్బరామి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోనూ అధ్యక్షునిగా సేవలందించారు. అలా ఆయన అటు రాజకీయ రంగానికి ఇటు సినిమా రంగానికి తనదైన కృషి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: