క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారిలో అన్ని వ‌య‌స్సుల వారు ఉన్నా.. మ‌ర‌ణించే వారిలో మాత్రం ఎక్కువ‌గా వృద్ధులే ఉంటున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. భార‌త్‌లో కూడా ఇప్ప‌టివ‌ర‌కు 178 మంది మ‌ర‌ణించ‌గా.. ఇందులో ఎక్కువ‌గా వ‌యోధికులే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ శాతం 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక‌ పాశ్చాత్యదేశాల్లో 80, ఆపైన వయస్కులు ఎక్కువ‌గా కరోనా వల్ల మరణిస్తున్నారు. భార‌త‌ దేశంలో మార్చి ఆరో తేదీ వరకు నమోదైన 4,097 పాజిటివ్‌ కేసులు, 109 మరణాలపై జరిగిన ఓ అధ్యయనంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మృతుల్లో 60, ఆపైన వయస్కులే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 109 మరణాల్లో 69 మంది 60 ఏండ్లు దాటిన వారుండటం గమనార్హం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మృతుల సగటు వయస్సు 20 ఏండ్లు తక్కువగా ఉండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

భార‌త్‌లో మృతి చెందిన 109 మందిలో 56 శాతం మందికి మధుమేహం ఉండగా, 47 శాతం మందికి రక్తపోటు ఉన్న‌ట్లు ఆ అధ్య‌య‌నంలో తేలింది. ఇదే స‌మ‌యంలో మ‌ధుమేహం, ర‌క్త‌పోటు ఉన్న‌వారు 86 మంది ఉన్నారు. 16 శాతం మందికి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇక ఇటలీ తదితర పాశ్చాత్య దేశాల్లో కూడా మృతుల సగటు వయస్సు 70 నుంచి 80 మధ్య ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ రోగులు, మృతుల వయో పరిమితిని విశ్లేషించగా, 80 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 26.4 శాతం ఉన్నారు. అంటే.. వ్యాధి నిరోధక శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌వారు, మ‌ధ్య వ‌య‌స్కులు క‌రోనాను త‌ట్టుకుని తొంద‌ర‌గా కోలుకుంటున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మాత్రం క‌రోనాతో పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని చెబుతున్నారు. కాగా, భార‌త్‌లో బుధ‌వారం రాత్రి వ‌ర‌కు కేసుల సంఖ్య ఆరువేల‌కు చేరువ‌లో ఉంది. దేశ వ్యాప్తంగా 5916మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు 78మంది మ‌ర‌ణించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: