భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా  24గంట‌ల వ్య‌వ‌ధిలో549 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 17మంది మృతి చెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5734 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. మొత్తం 166 మంది మ‌ర‌ణించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేగాకుండా..క‌రోనా క‌ట్ట‌డికి అస‌వ‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మైన పీపీఈ కిట్లు, వెంటిలేట‌ర్ల‌ను పంపిస్తున్నామ‌న్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల‌కు తొమ్మిది క‌రోనా స్పెష‌ల్ టీమ్స్‌ను పంపించామ‌ని ఆయ‌న తెలిపారు. 20 దేశీయ కంపెనీలు పీపీఈ కిట్లు త‌యారు చేశాయ‌ని, 49వేల వెంటిలేట‌ర్ల‌కు ఆర్డ‌ర్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

 

అంతేగాకుండా 1.54 పీపీఈ కిట్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చామ‌ని ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. అయితే.. ఐదు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర‌మైన‌ ప‌రిస్థితి ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. దేశంలో మందుల కొర‌గానీ.. పీపీఈ కిట్ల కొర‌తగానీ లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇక రైల్వే శాఖ త‌రుపున సుమారు 2500మంది వైద్యులు ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ల‌క్షా ముప్పై వేల ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ ప్ర‌తినిధులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా..ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాందోళ‌న‌కు గురికావొద్ద‌ని, ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ల‌వ్ అగ‌ర్వాల్‌ సూచించారు. ప్ర‌జ‌లు స్వీయ‌నియంత్ర‌ణ‌, సామాజిక దూరం పాటించాల‌ని ఆయ‌న అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: