తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌భుత్వం మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎక్కువ‌గా కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న‌ 12ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ఇప్ప‌టికే గుర్తించింది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాలను కూడా కంటైన్మెంట్‌ జాబితాలో చేర్చారు. ఆ ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేసి అష్ట దిగ్బంధం చేస్తున్నారు అధికారులు. ప్రతి ఇంటిని సర్వే చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రతి ఇంటిని వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత అధికారులు త‌నిఖీ చేసి, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలితే వారిని వెంట‌నే ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్‌ సోకివారిని ఐసోలేషన్‌ లేదా నిర్బంధ కేంద్రానికి తరలించేందుకు రెడీ అవుతున్నారు. ఈ కంటైన్మెంట్ ఏరియాల్లో ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పక క్రిమి సంహారకార మందును పిచికారీ చేస్తారు.

 

ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. వారికి అవసరమైన నిత్యావసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇక‌ క్లస్టర్లలో పోలీసు అధికారులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ‘కార్డన్‌ ఆఫ్‌’ చేసేదిశ‌గా అడుగులు వేస్తున్నారు. కాగా, గత నెలలో ఢిల్లీ వెళ్లివచ్చినవారు కేవలం హైదరాబాద్‌ జిల్లాలోనే 593 మంది ఉండ‌డం గ‌మ‌నార్హం. వారిలో 83 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. వీరి ద్వారా మరో 51 మందికి కరోనా వ్యాపించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70 మందికి సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను  జియోట్యాగ్‌ చేస్తున్నారు. బుధ‌వారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 659 మంది నివాసాలకు అధికారులు జియోట్యాగ్‌ చేశారు. అయితే..ప్ర‌స్తుతం కంటైన్మెంట్ ప్రాంతాల‌ను ప్ర‌క‌టించారు. 

1) రాంగోపాల్‌పేట, 2) షేక్‌పేట్‌, 3) రెడ్‌హిల్స్ , 4) మలక్‌పేట్, సంతోష్‌నగర్‌, 5) చాంద్రాయణగుట్ట , 6) అల్వాల్ , 7) మూసాపేట, 8) కూకట్‌పల్లి , 9) కుత్బుల్లాపూర్, గాజులరామారం, 10) మయూరీనగర్‌, 11) యూసుఫ్‌గూడ, 12) చందానగర్‌, 13) బాలాపూర్‌, 14) చేగూరు, 15) తుర్కపల్లి

మరింత సమాచారం తెలుసుకోండి: