భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. రోజురోజుకూ దాని ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 6725 న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణించిన వారి సంఖ్య 226కు చేరుకుంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా సుమారు 1300కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు 50మందికిపైగా మ‌ర‌ణించారు. దేశ వాణిజ్య రాజ‌ధాని అయిన ముంబైలోనే ఎక్కువ‌గా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు, ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. 

 

వైర‌స్ వ్యాప్తి నిరోధానికి మ‌రిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా క‌దులుతున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా లాక్‌డౌన్‌ను పొడిగించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ 14 త‌ర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రికేసీఆర్‌తోపాటు మ‌రికొంద‌రు ముఖ్య‌మంత్రులు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి సూచించారు. ఇక ఇదే క్ర‌మంలో కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఒడిశాలో ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించారు ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌. ఇప్పుడు ఇదే దారిలో అనేక రాష్ట్రాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. మ‌రో 12 నుంచి 18 నెల‌ల వ‌ర‌కూ క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని, అప్ప‌టివ‌ర‌కు భార‌త్‌తోపాటు అనేక దేశాల్లో లాక్‌డౌన్లు మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తూనే ఉంటాయ‌ని అమెరికాలోని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్ ప్రొఫెస‌ర్ ఆశిష్‌కుమార్ ఝా చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: