అగ్రరాజ్యం అమెరికా క‌రోనా వైర‌స్‌తో చిగురుటాకులా వ‌ణికిపోతోంది. వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజు వందలు, వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  కేవ‌లం 24 గంటల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 2 వేల మంది మృతి చెందడంతో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 4,64,845 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 16498మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక 25వేల మందికిపైగా క‌రోనా బారి నుంచి కోలుకున్నారు. ఇక‌ కరోనా వైరస్‌ ధాటికి న్యూయార్క్‌ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్‌–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేస్తున్నారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. 

 

 ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలో మరొక ఇండియన్‌ చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు.  వీరి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: