మంత్రి హ‌రీశ్‌రావు.. తెలంగాణ రాజ‌కీయాల్లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు పొందిన నేత‌. ప్ర‌జ‌లే త‌న లోకంగా జీవించే నాయ‌కుడు. ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనైనా ప్ర‌జ‌ల వ‌ద్ధ‌కు వెళ్లి వారి క‌ష్టాల‌ను తెలుకుంటూ ముందుకు వెళ్లే అరుదైన నేత‌ల్లో హ‌రీశ్‌రావు ముందువ‌రుస‌లో ఉంటారు. నిజానికి.. క‌రోనా వైర‌స్ కుదిపేస్తున్న స‌మ‌యంలోనూ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. వారి క‌ష్టాల‌ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రైతుల‌కు భ‌రోసా ఇస్తున్నారు. ఎవ‌రు కూడా రందిప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌ని, మీరు పండించిన ప్ర‌తీ గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని ఆయ‌న హామీ ఇస్తున్నారు. ప్ర‌స్తుత విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల్లో ప్రాణాల‌నే కాదు.. పంట‌ల‌ను కాపాడుకోవ‌డం కూడా ఎంతో ముఖ్య‌మని గుర్తించిన ఆయ‌న.. ఆ దిశ‌గా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ రైతాంగానికి ధైర్యం చెబుతున్నారు. 

 

తాజాగా.. సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మండలంలో మంత్రి హరీశ్‌ రావు శుక్ర‌వారం పర్యటించారు. గురువారం సాయంత్రం, రాత్రి కురిసిన‌ వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి పరిశీలించారు. పంట నష్టంపై త్వరితగతిన నివేదిక రూపొందించాలని అధికారులకు మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. పీఎం కిసాన్‌ యోజన బీమా కట్టిన రైతులకు సంబంధించిన జాబితాను రూపొందించి బీమా అధికారులకు సమాచారం అందించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆయ‌న‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటుందని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడకుండా ఉండాలని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారిపై వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. పంట అమ్మే దగ్గర, ఇతర ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని ఆయ‌న సూచిస్తున్నారు. అంతేగాకుండా.. స్వ‌యంగా క‌రోనా ఐసోలేష‌న్ వార్డులోకి వెళ్లి కూడా మంత్రి హ‌రీశ్‌రావు బాధితుల‌తో మాట్లాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: