తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కొత్తగా మరో 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగిన కోవిడ్‌–19 పరీక్షల్లో ఈ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌ గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశంలో ఒకటి, వైఎస్సార్‌ జిల్లాలో ఒకటి చొప్పున కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 405కి చేరింది. శనివారం ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 17 కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేశారు. గుంటూరు నగరాన్ని మొత్తం కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మాస్కులు లేకుండా బయటకువస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ఆ జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్ ఇప్ప‌టికే ప్రకటించారు. ఆదివారం గుంటూరు జిల్లా మొత్తం పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు. 

తెలంగాణ రాష్ట్రంంలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ‌గానే న‌మోదు అవుతోంది. శ‌నివారం రాత్రి వ‌ర‌కు ఈ కేసుల వివ‌రాలను స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు.  దేశాల‌నుంచి వ‌చ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. శ‌నివారం రాత్రి వ‌ర‌కు మొత్తం 503 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. ఇందులో 14మంది చ‌నిపోయారని, 96 మంది డిశ్చార్జ్ అయ్యారని, యాక్టివ్ కేసులు 393 ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 243 కంటైన్మెంట్ ప్రాంతాల‌ను గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 123, మిగ‌తా ప్రాంతాల్లో 120 కంటైన్మెంట్ ప్రాంతాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. ఇక ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను సీఎం కేసీఆర్ పొడిగించిన విష‌యం తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: