ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తోంది. ధ‌నిక పేదా, చిన్న‌దేశం, అగ్ర‌రాజ్యం.. అన్న తేడా లేకుండా ఎవ్వ‌రినీ వ‌ద‌లడం లేదు క‌రోనా మ‌హ‌మ్మారి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 108828 పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 1780315 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో ఒక్క అమెరికాలోనే  532,879 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేసుల్లో అమెరికా మొద‌టి స్థానంలో నిలిచింది. త‌ర్వాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ దేశాలున్నాయి. అయితే... ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 22వేల మందికిపైగా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు క‌రోనా బారిన ప‌డ్డార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నిజానికి.. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన పూర్తిస్థాయిలో స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు డబ్ల్యూహెచ్‌వోకు అంద‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ సంఖ్య త‌క్కువ‌గా న‌మోదు అవుతున్న‌ట్లు తెలుస్తోంది. 

 

ప్రాణాల‌కు తెగించి క‌రోనా పేషెంట్ల‌కు వైద్య చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ఒక్క ఇట‌లీలోనే సుమారు వంద‌మందికిపైగా మ‌ర‌ణించారు. భార‌త్‌లోనూ క‌రోనా బారిన ప‌డుతున్న వైద్య‌సిబ్బంది సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఒక్క ముంబైలోనే సుమారు 90మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఇందులో వైద్యులు, న‌ర్సులు ఉన్నారు.  హెల్త్‌కేర్ కార్మికులను రక్షించడానికి, ముసుగులు, గాగుల్స్, గ్లోవ్స్, గౌన్లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల‌ను త‌ప్ప‌కుండా వాడాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటూ క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స చేయాల‌ని సూచించింది. *ప్రతి నెలా కనీసం 100 మిలియన్ మెడికల్ మాస్క్‌లు, చేతి గ్లౌస్‌లు రవాణా చేయాల్సి ఉంటుంది. 25 మిలియన్ల N95 రెస్పిరేటర్లు, గౌన్లు, ఫేస్-షీల్డ్స్ పంపించాల్సి ఉంది* అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: