క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఏప్రిల్ 14వ‌ లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండిపోయారు. ఇందులో వేల సంఖ్య‌లో వ‌ల‌స కూలీలు కూడా అనేక రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. రెక్కాడితేగానీ.. డొక్కాడ‌ని కూలీలు ప‌నికోసం సొంతూళ్ల‌ను వ‌దిలి ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌పోయారు. ఈ క్ర‌మంలోనే ఇత‌ర ప్రాంతాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అనేక మంది కూలీలు వ‌చ్చారు. లాక్‌డౌన్ విధించడంతో అధికారులు వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్‌ కేంద్రంలో ఓ నిండు గ‌ర్భిణి చేరింది. అధికారులు ఆమెను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. 13 రోజులుగా ఉంటున్న ఆ వలస కూలీ ప్రసవించింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ వలస కూలీగా శ్రీకాకుళం జిల్లాకు వ‌చ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా పాలకొండ క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటోంది. 

 

నిండు గర్భిణి అయిన ఆమెను ప్రసవం నిమిత్తం శ్రీకాకుళం స‌ర్వేజ‌న ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆసుపత్రి పరిశీలనకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. ఆమెకు బేబీ కిట్‌ను అందజేశారు. అంతేగాకుండా.. పుట్టిన బిడ్డ సంరక్షణకు రూ.25 వేలు అందజేశారు. అయితే.. ఆ కేంద్రంలో, ఆస్ప‌త్రిలో అందించిన సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 420కు చేరుకుంది. గుంటూరు 7, నెల్లూరు 4, కర్నూలు 2, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 84 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యియి. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. వైరస్‌ నుంచి కోలుకుని 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: