ఏప్రిల్ 14తో దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు ముగియ‌నుంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఈరోజు రాత్రి దేశ ప్ర‌జ‌ల‌కు సందేశం ఇస్తూ కీల‌క నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వ‌బోతున్నారు..?  లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..?  పొడిగించ‌రా..?  ఒక వేళ పొడిగిస్తే.. దేశ వ్యాప్తంగా ఒకేరీతిలో ఉండేలా నిర్ణ‌యం తీసుకుంటారా..?  లేక త‌న‌దైన శైలిలో మ‌రేదైనా ట్విస్ట్ ఇస్తారా..? ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే. కేవ‌లం నాలుగు రోజుల్లోనే క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా సుమారు 80కొత్త జిల్లాల‌కు వ్యాప్తి చెందిన‌ట్లు స్వ‌యంగా కేంద్ర అధికార వ‌ర్గాలే వెల్ల‌డించాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 364 జిల్లాల‌కు వైర‌స్ వ్యాప్తి చెందింది. అంటే స‌గం భార‌తాన్ని క‌రోనా చుట్టేసింద‌న్న‌మాట‌.

 

ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడ‌గించ‌డం ఖాయ‌మ‌నేగానీ.. అది ఎలా ఉంబోతుంద‌న్న‌దే అంద‌రిలోఉత్కంఠ‌ను రేపుతోంది. ఇప్ప‌టికే దేశాన్ని రెడ్‌, ఆరేంజ్‌, గ్రీన్ జోన్లుగా విభ‌జించారు. మ‌రోవైపు కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాలు ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. నిజానికి .. ఇటీవ‌ల నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనూ ముఖ్య‌మంత్రులంద‌రూ లాక్‌డౌన్‌ను పొడిగించాల‌నే సూచించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం కోసం దేశ‌ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజ‌గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.. లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణ‌యాన్ని ఆయా రాష్ట్రాల‌కే వ‌దిలేసే దిశ‌గా మోడీ ఆలోచించే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: