భార‌త్‌కు మంచి రోజులు వ‌స్తున్నాయి. క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డే కాలం ద‌గ్గ‌ర‌లోనే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే గోవా క‌రోనాను జ‌యించిన మొద‌టి రాష్ట్రంగా రికార్టు సృష్టించింది. తాజాగా ఆ జాబితాలో మ‌ణిపూర్ చేరింది. ఈ రాష్ట్రం కూడా క‌రోనాపై విజ‌యం సాధించింది. తమ రాష్ట్రంలో కోవిడ్‌ సోకిన ఇద్దరు పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారని, వారికి నిర్వహించిన కరోనా వైరస్‌ నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ ప్రకటించారు. *మణిపూర్‌ ఇప్పుడు కరోనా వైర‌స్ ర‌హిత‌ రాష్ట్రమని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కోవిడ్‌19 బాధితులిద్దరూ పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్‌డౌన్‌ కారణంగానే ఇది సాధ్యమయింది* అని బీరేన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

 

కాగా, గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్ర రాజ‌ధాని ఇంఫాల్‌లో మాత్రం లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఆయ‌న‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వస్తువుల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని ఆయ‌న‌ తెలిపారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. గోవాలో పాజిటివ్‌ కేసులు లేకపోయినప్పటికీ లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా.. సుమారు రెండు వారాల నుంచి దేశవ్యాప్తంగా 59 జిల్లాల్లో కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: