దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం చూపుతోంది. రోజురోజ‌కూ క‌రోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 18వేల‌కు పైగా కొవిడ్‌-19 కేసులు న‌మోదుకాగా.. సుమారు ఆరువంద‌ల మంది మ‌ర‌ణించారు. ప‌లు రాష్ట్రాల్లో వైర‌స్ విజృంభిస్తోంది. కానీ ఈశాన్యంలో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేదు. మ‌ణిపూర్ మార్చి 25వ తేదీన మొద‌టి కేసు న‌మోదు అయింది. ఇక మ‌ళ్లీ అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క కొత్త‌కేసు కూడా న‌మోదు కాలేదు.  ఇక సిక్కింలో ఆ ఒక్క కొవిడ్ కేసు కూడా న‌మోదు కాలేదంటే ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దూ.. నిజంగా ఇది నిజ‌మే.. ఈ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి జాడేలేదు. ఇందుకు ఎన్నో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంది ఈ రాష్ట్రం.

 

గ‌త జనవరిలో కేరళలో తొలికేసు నమోదైనప్పుడే సిక్కిం వెంట‌నే అప్రమత్తమైంది. ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు చేపట్టి ఎట్టకేలకు కరోనా మ‌హ‌మ్మారి త‌మ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కట్టడి చేయ‌గ‌లిగామ‌ని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ చెప్పారు. *జనవర్ 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. ఫిబ్రవరి నెల‌లో  మేం వేగంగా  స్క్రీనింగ్ జరిపాం. మార్చి 5న విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం విధించాం. స్వదేశీ టూరిస్టులపై మార్చి 17 నుంచి నిషేధం పెట్టాం. రాష్ట్ర సరిహద్దుల్ని మూసేశాం. ఈ వ్యూహం బాగా పనిచేసింది' అని ఆయన పేర్కొన్నారు. సిక్కిం ఇప్ప‌టికే ఆరు లక్షల మందికి పైగా జనానికి స్క్రీనింగ్ చేసింది. ఆరోగ్య‌ కార్యకర్తలు, అధికారులు, పౌరుల కృషి వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ప్రేమ్‌సింగ్ అన్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత కూడా ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: