హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లిష్ మీడియం కావాలా..?   తెలుగు మీడియం  కావాలా..? అనే ప్ర‌శ్న‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంటింటి స‌ర్వే చేప‌ట్టేందుకు రెడీ అవుతోంది. తెలుగులో బోధించాలా..? ఇంగ్లిష్‌లో బోధించాలా..? అన్న‌ది పిల్ల‌ల త‌ల్లిదండ్రులకే వ‌దిలివేయాలంటూ హైకోర్టు తీర్పు చెప్పిన నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ల్లిదండ్రుల అభిప్రాయాలు సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేర‌కు ఇంటింటి సర్వే బాధ్యతను గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఇక ఈ స‌ర్వేను జిల్లా, మండల స్థాయి విద్యాశాఖాధికారులు ప‌ర్య‌వేక్షించాల‌ని పాఠశాల ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో కోసం ప్రత్యేక ఫార్మట్‌ను రూపొందించి గ్రామ కార్యదర్శులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాకుండా.. ఈ స‌ర్వేలో  పాఠశాలల‌ పేరెంట్స్ కమిటీలను భాగస్వామ్యులను చేయనున్నారు. గ్రామ కార్యదర్శులతో పాటు పేరెంట్స్ కమిటీలు కూడా ఇంటింటి సర్వేలో పాల్గొనాల్సి ఉంటుంది.

 

ఈ స‌ర్వే ఆధారంగానే వచ్చే విద్యా సంవత్సరంలో ఏమీడియంలో బోధించాల‌న్న‌ది ఆధార‌ప‌డి ఉంది. ఈ స‌ర్వే వివ‌రాల‌తో రూపొందించిన నివేదిక‌ను సుప్రీంకోర్టులో ప్ర‌భుత్వం సమర్పించనుంది. దీనికోసం వచ్చేనెల మొదటి వారంలో సుప్రీంకోర్టులో ఓ స్పెషల్ లీవ్ పిటీషన్‌ను వేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకుంది. అయితే.. ప్ర‌జాతీర్పు మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని, ఇంగ్లిష్ మీడియం వైపే పిల్ల‌ల తల్లిదండ్రులు మొగ్గుచూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యా బోధనను కొనసాగించడానికి ఉద్దేశించిన రెండు జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు సుధీష్ రాంభొట్ల రిట్ పిటీషన్లను దాఖలు చేయ‌గా.. విచారణ చేపట్టిన హైకోర్టు ఇటీవ‌ల‌ ఈ రెండు జీవోలను కొట్టేసిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: