భార‌త్‌లో క‌రోనా వైర‌స్‌పై అద్భుత విజ‌యాలు న‌మోదు అవుతున్నాయి. రివ‌క‌రీ రేట్ కూడా పెరుగుతోంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో రిక‌వ‌రీ రేట్ 19.89శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. తాజాగా.. ఉత్త‌రాఖండ్‌లో 9నెల‌ల చిన్నారి కేవ‌లం ఆరు రోజుల్లోనే క‌రోనా వైర‌స్‌ను జ‌యించి, అంద‌రికీ కొండంత ధైర్యాన్నిచ్చింది. అస‌లేం జ‌రిగిందో చూద్దాం.. ఉత్త‌రాఖండ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఢిల్లీలో నిర్వ‌హించిన త‌బ్లిఘీ జ‌మాత్‌కు వెళ్లి వ‌చ్చాడు. ఆయ‌ను క‌రోనా సోక‌గా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..కుటుంబ స‌భ్యుల‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా.. తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని. కానీ ఆ 9 నెల‌ల‌ చిన్నారికి మాత్రమే కరోనా సోకింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు ఏప్రిల్ 17న ఆసుపత్రిలో చేర్పించారు. బాబు త్వ‌ర‌గా కోలుకోవ‌డంతో గురువారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు.

 

ఆరు రోజుల్లోనే ఆ చిన్నారి కోవిడ్ నుంచి బయటపడటంతో అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగిటివ్‌ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ చిన్నారికి తండ్రి ద్వారా కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిన్నారి గురించి ఆసుపత్రి డాక్టర్ ఎన్‌ఎస్‌ ఖాత్రి మాట్లాడుతూ.. పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు. పాలు తాగే వయసు కావడంతో.. చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆ చిన్నారిలో ఏమాత్ర‌మూ కరోనా లక్షణాలు కనిపించలేదని, నవ్వుతూ ఉన్నాడని చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. కాగా, నిన్న పుణెలో కూడా 92ఏళ్ల బామ్మ క‌రోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు వైద్యుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఎంతో మాన‌సిక‌ ధైర్యాన్ని ఇస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: