శుభకార్యానికి 20 మంది బంధువులొచ్చారు.. ఇంత‌లోనే లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌. ఇంకేముంది.. ఆ బంధువులంద‌రూ 38రోజులుగా అదే ఇంట్లో చిక్కుకుపోయారు. కేవ‌లం రెండు గ‌దులు ఉన్న ఇంట్లోనే తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అంత‌మందికి రోజూ భోజ‌నం వండిపెట్టాలంటే ఎంత‌క‌ష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు. భోజన సదుపాయం కల్పించడం తమవల్ల కావడం లేదంటూ  సికింద్రాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం మీడియాతో ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక వివ‌రాలు చూద్దాం.. మార్చి 19న హైద‌రాబాద్‌లోని పార్శిగుట్టలోని రామగిరి చంద్రయ్య ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తన కుమారుడి వివాహ‌ విందు నిర్వహించారు. ఇందుకోసం విజయవాడ నుంచి 20 మంది బంధువులు వచ్చారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించడంతో.. ఒక్కరోజే కదా అని అక్క‌డే ఆగిపోయారు. అదేరోజు రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో చేసేదేమీలేక‌ ఇక్కడే చిక్కుకుపోయారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో మ‌రింత‌గా ఇరుక్కుపోయారు. దాదాపు 38 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

 

రామచంద్రయ్యది కూడా పేద కుటుంబం. ఆయ‌న‌ ఓ సాధారణ టైలర్. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే ఉండిపోవ‌డంతో రామ‌చంద్రయ్య తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కేవలం రెండంటే రెండే గదులున్న ఆ అద్దె ఇంట్లో ఇంతమంది న‌ర‌కం అనుభ‌విస్తున్నారు.  ప్రభుత్వం కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోసం ప్రయత్నించినప్పటికీ తమను పట్టించుకున్నవారే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఒకసారి విజయవాడ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమను చెక్ పోస్ట్ దాటనివ్వలేదని రామ‌చంద్ర‌య్య అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అనుమతించకపోవడంతో.. చేసేది లేక మళ్లీ ఇక్కడికే వచ్చామన్నాని ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. తమలో కొందరు పిల్లలను విజయవాడలోనే వదిలేసి వచ్చారని.. ఇప్పుడు వారు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్ర‌భుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకేదైనా మార్గం చూపించాలని విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: