కరోనా వైరస్ ప్రభావంతో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా మహమ్మారి పేరు చెబితే చాలు వణికి పోతున్నారు. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ చికిత్స పొందుతున్న వార్డులోని వ్యక్తి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.  లాలుకు వైద్యం చేసిన వైద్యుడు డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ ఆ వ్యక్తికి కూడా చికిత్స అందించడంతో డాక్టర్ సహా ఆ విభాగంలోని సిబ్బందిని అందరినీ మూడు వారాలపాటు క్వారంటైన్‌కు పంపారు.  కాగా, లాలు ప్రస్తుతం రాంచీలోని రాజేంద్రనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పేయింగ్ వార్డులో రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు.

 

కరోనా రోగికి చికిత్స చేసిన వైద్యుడే లాలూకు కూడా సేవలు అందిస్తుండడంతో ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు కరోనా సోకే అవకాశం ఉంది కనుక ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రీయ జనతదళ్ (ఆర్జేడీ) డిమాండ్ చేసింది. లాలూ ప్రస్తుతం జార్ఖండ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. 

 

కరోనా వైరస్ వల్ల తన తండ్రికి ప్రమాదం ఉందని..ఆ  వైరస్ సోకే అవకాశముంది కనుక ఆయనను పెరోల్‌పై విడుదల చేయాలని లాలూ కుమారుడు, ప్రస్తుతం ఆర్జేడీ వ్యవహారాలు చూస్తున్న తేజశ్వి యాదవ్ డిమాండ్ చేశారు. లాలూను పెరోల్‌పై విడుదల చేసే విషయమై జార్ఖండ్ ప్రభుత్వం న్యాయసలహాలు తీసుకుంటున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: