కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. నిరంత‌రం సాగుతున్న ప‌రిశోధ‌న‌ల‌తో వైర‌స్‌కు సంబంధించి అనేక కొత్త కోణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు పది వేర్వేరు రూపాల్లోకి క‌రోనా వైర‌స్‌ పరివర్తనం చెందిన‌ట్లు అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో ఏ2ఏ రకం వైరస్‌ భౌగోళిక ప్రాంతాలతో సంబంధ‌ లేకుండా అత్యంత ప్రభావం చూపుతున్నదని తేలింది. చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన ‘ఓ’ రకం వైరస్‌ కంటే.. దాని నుంచి ఉత్పరివర్తనం చెందిన ఏ2ఏ ప్ర‌భావం అధికంగా ఉన్నదని తేలింది. బెంగాల్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జెనోమిక్స్‌'కు (ఎన్‌ఐబీజీ) చెందిన శాస్త్రవేత్తలు నిధాన్‌ బిశ్వాస్‌, పార్థా మజుందార్‌ ఈ అధ్యయనం నిర్వహించారు.

 

సుమారు 55 దేశాల నుంచి సేకరించిన 3,600 ఆర్‌ఎన్‌ఏ స్వీక్వెన్స్‌లను వారు విశ్లేషించారు. ఏ2ఏ రకానికి చెందిన కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల కణాల్లోకి వేగంగా చొచ్చుకుపోతుంద‌ని వెల్ల‌డించారు. దీనికి వ్యాప్తిచెందే సామర్థ్యం కూడా ఎక్కువని, అందుకే అది చూస్తుండ‌గానే ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టేసింద‌ని పేర్కొన్నారు. భారత్‌లో 47.5శాతం నమూనాలలో ఏ2ఏ రకం వైరస్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. కాగా, కరోనా వైరస్‌ను ఓ, ఏ2, ఏ2ఏ, ఏ3, బీ, బీ1 ర‌కాలుగా విభ‌జించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: