తెలంగాణ‌లో ఒక్కొక్క‌టిగా జిల్లాలు క‌రోనా ర‌హితంగా మారుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య జీరోకు ప‌డిపోతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌ రాష్ట్రంలో 11 కరోనా రహిత జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది. వనపర్తి, వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాలకు చెందిన వారెవరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం లేదు. ఈ ఎనిమిది జిల్లాలకు చెందిన పాజిటివ్‌ కేసులున్న వారందరూ క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

 

ఈ నేప‌థ్యంలో ఈ జిల్లాలన్నింటినీ తెలంగాణ‌ ప్రభుత్వం కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించినట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు. ఇక నిన్న‌ కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయని ఆ బులెటిన్‌లో వెల్లడించారు. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని ఆయ‌న‌ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. తాజాగా 35 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 409 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 582 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. మే 7వ తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగ‌నున్న విష‌యం తెలిసిందే..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: