బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రిషీకపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. నిజానికి ఈరోజు ఉద‌య‌మే ప్రముఖ బాలీవుడ్ నటుడు  రిషీ కపూర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆస్పత్రిలో చేరిన‌ట్లు ఆయన సోదరుడు, మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన రణధీర్ కపూర్ వెల్లడించారు. తమ్ముడికి క్యాన్సర్ ఉందని..  శ్వాసకోశ‌ ఇబ్బందులు ఉన్నాయని ఆయ‌న తెలిపారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో సర్ హెచ్ఎన్ రిలయన్స్  ఫౌండేషన్ హాస్పిటల్లో చేర్పించామ‌ని... ప్రస్తుతం ఆరోగ్య‌ పరిస్థితి బాగానే ఉందని అని ఆయన చెప్పారు. అయితే రిషీక‌పూర్‌ వెంటిలేటర్‌పై ఉన్నాడని వస్తున్న వార్తలను ర‌ణ‌ధీర్‌క‌పూర్‌ కొట్టిపారేశారు.

 

కానీ.. ఆయ‌న ప్ర‌క‌టించిన కొద్దిసేప‌టికే రిషీక‌పూర్ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త‌తో బాలీవుడ్ దిగ్భాంత్రికి లోనైంది.  1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో రిషీక‌పూర్‌ హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండో కుమారుడు. రిషీక‌పూర్ మొన్న‌టి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 2018లో రిషీక‌పూర్‌కి క్యాన్సర్ ఉన్న‌ట్లు బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకున్నారు. ఇక‌ భార్య, బాలీవుడ్ నటి నీతూసింగ్ ఆయన వెంటే ఉన్నారు. యువహీరో రణబీర్ కపూర్ రిషీ కుమారుడే. కాగా, క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ బాలీవుడ్ హీరో ఇర్ఫాన్ ఖాన్ నిన్న‌నే మృతి చెందిన విష‌యం తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: