తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం గత కొన్ని రోజులుగా ప‌ర్య‌టిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో కరోనా వైద్య సౌకర్యాలపై స్పందించింది. గురువారం ఢిల్లీలో కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని పరిస్థితుల గురించి కూడా ప్రస్తావించారు. అయితే.. తెలంగాణలో తగిన సంఖ్యలో కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు చేయడం లేదని ఇటీవ‌ల విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. క‌రోనా కేసుల సంఖ్య ఒక్క‌సారిగా త‌గ్గ‌డంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే.. నేపథ్యంలో కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర బృందం అక్కడ తగినన్ని క‌రోనా వైర‌స్‌ టెస్టింగ్‌ కిట్లు, వైద్యుల ర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన‌ పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి త‌గినంత‌ అందుబాటులో ఉన్నట్టు గుర్తించిందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ స్ప‌ష్టం చేశారు. ఎండ్-టు-ఎండ్ ఐటీ డ్యాష్‌ బోర్డు ద్వారా కరోనా పరీక్షలు చేసినప్పటి నుంచి డిశ్చార్జి వరకు పేషెంట్లను ట్రాక్ చేసే సాంకేతికతను వాడుతున్నారని సలీల శ్రీవాస్తవ చెప్పారు. హైద‌రాబాద్‌లో పోలీసులు లాక్‌డౌన్‌లు అపకడ్బందీగా అమలు చేస్తున్నారని.. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందజేస్తున్నారని చెప్పారు. కాగా, కాంగ్రెస్ నేత ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేత ర‌మ‌ణ త‌దిత‌రులు ఈ రోజు విమ‌ర్శ‌లు చేసిన కొద్దిసేప‌టికే కేంద్ర అధికారులు ఇలా స్పందించ‌డం గ‌మ‌నార్హం. అంటే విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కేంద్ర అధికారులే స‌మాధానం చెప్పార‌న్న‌మ‌ట‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: