కరోనా వైర‌స్ బాధితుల‌కు అందిస్తున్న వైద్యం ఖ‌ర్చు ఎక్కువ‌గానే ఉంటుంది. పేషెంట్ల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందించేందుకు భారీ మొత్తంలోనే ఖ‌ర్చు చేస్తున్నాయి. ఇందులోనూ తెలంగాణ ప్ర‌భుత్వం ఖ‌ర్చుకు ఏమాత్ర‌మూ వెనుకాడ‌కుండా నిధులు కేటాయిస్తోంది. క‌రోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష మొదలు కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో పేషెంట్‌కు రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులకు దాదాపు రూ.36.54 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారికి రూ.16.24 కోట్లు ఖర్చయినట్టు తెలుస్తోంది. ఒక కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 ఖర్చవుతున్నది. పాజిటివ్‌ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. దీంతో మూడుసార్ల‌కు ఒక్కొక్కరికీ రూ.13,500 వ్యయమవుతున్నది.

 

అనుమానితులను అంబులెన్స్‌లో తీసుకురావ‌డం, డిశ్చార్జ్ చేయ‌డం.. ఇంటికి చేర్చ‌డం.. ఇలా రవాణా ఖర్చు రూ.4 వేలకుపైగా అవుతున్నది. పాజిటివ్‌ వ్యక్తులకు కోలుకొనేవరకు కనీసం 80 వరకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు ఉపయోగిస్తారు. వీటిని ఒక్కసారి వాడితే తిరిగి వినియోగించే అవకాశం లేదు. ఇక ఒక్కో కిట్‌ ధర రూ.2,500 వరకు ఉంటుంది. ఒక్కో వ్యక్తికి పీపీఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖ‌ర్చు అవుతుంద‌ట‌. మందులకు రూ.50 వేలు అవుతుంద‌ట‌. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నవారికి బ‌ల‌వ‌ర్థ‌క‌మైన‌ ఆహారాన్ని అందిస్తున్నారు.ఇందుకోసం రూ.55 వేల వరకు వ్యయమవుతున్నది. చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సబ్బులు, శానిటైజర్‌, ప్రత్యేక డ్రెస్‌ వంటి వాటికోసం రూ.27 వేలు ఖర్చవుతున్నది. ఇలా చూస్తే.. దేశ‌వ్యాప్తంగా వంద‌ల కోట్ల ఖ‌ర్చు అవుతుంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: