దేశంలో ఓ వైపు సీరియస్ గా లాక్ డౌన్ కొనసాగుతుంది.  కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు.  అయితే లాక్ డౌన్ అమల్లో ఉన్నా కొంత మంది మాత్రం ఉల్లంఘనకు పాల్పపడుతున్నారు.  ఈ నేపథ్యంలో కొంత మంది అల్లరిమూక రోడ్లపైకి వచ్చి గొడవలు పడుతున్న సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అంతే కాదు పోలీసులపై కూడా కొంత మంది రాళ్లు రువ్వడం.. కర్రలతో ఎటాక్ చేయడం కూడా చూస్తున్నాం.  ఇదిలా  ఉంటే హైదరాబాద్ పాతబస్తీలో కొంత మంది పోకిరీల మద్య గొడవ చిలికి చిలికి గాలివాన కావడంతో పెద్ద రగడ జరిగింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండి పటిష్ట బందో బస్తు ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం ఆకతాయిలు రెచ్చిపోతూనే ఉన్నారు.

 

పాతబస్తీలో కొంత మంది వ్యక్తులు నిబంధనలు ఏమి పట్టకుండా సినిమా స్టైల్‌లో స్ట్రీట్ ఫైట్‌కు దిగారు.  రెండు గ్యాంగ్‌లకు చెందిన యువకులు పరస్పరం కర్రలు, రాళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు. దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  ఈ ఘటన ఈడి బజార్ ప్రక్కనే ఉన్న మొయిన్ బాగ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. రాత్రి వేళ పెద్ద పెద్దగా అరుస్తూ.. దాడి చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

అక్కడికి చేరుకున్న భవానీనగర్ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.  కాగా, తీవ్రంగా  గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే  ఆ యువకులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రంజాన్ సమయంలో ఇలా దాడి చేసుకోవడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: