అమ్మో.. వంద‌ల కోట్ల‌లో త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు.. ఈ సంఖ్య చూస్తేనే దేనిని న‌మ్మాలో.. దేనిని న‌మ్మ‌కూడ‌దో అర్థంకాని ప‌రిస్థితి. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరిగిన‌ప్ప‌టి నుంచి ఈ త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌కు అంతేలేకుండా పోయింది.  2019 ఏడాదిలో మొత్తం 270 కోట్ల తప్పుడు ప్రకటనలను నిషేధించామని సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ వెల్లడించ‌డంతో ప్ర‌పంచ షాక్ తిన్న‌ది. నిబంధనలు ఉల్లంఘించిన తప్పుడు ప్రకటనలను నిమిషానికి 5,000 పై చిలుకు తీసిపారేసినట్లు గూగుల్‌ వెల్లడించింది. అంతేగాకుండా.. దాదాపు 10 లక్షల ప్రకటనకర్తల అకౌంట్లను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంది. గూగుల్ 1.2 మిలియన్లకు పైగా ఖాతాలను రద్దు చేసింది. తమ నెట్‌వర్క్‌లో భాగమైన 21 మిలియన్ వెబ్ పేజీల నుండి ప్రకటనలను తొలగించినట్టు వెల్లడించింది. ఇటీవల వెల్లడించిన బాడ్ యాడ్స్ రిపోర్ట్‌లో ఈ వివరాలను గూగుల్ పొందుపర్చింది.

 

యూజర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనల వలలో చిక్కుకోకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తితో ఫేస్‌ మాస్క్‌లు, నివారణ మందులు వంటి వాటికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో వీటికి సంబంధించే ఎక్కువగా మోసపూరిత ప్రకటనలు ఉన్నాయని గుర్తించినట్లు‌ తెలిపింది. కరోనా  వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారం, ప్రకటనలతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించే ప్రకటనలు, ప్రకటనకర్తలపై ఓ కన్నేసి ఉంచినట్లు గూగుల్‌ వివరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ టీమ్ నిరంత‌రం ప‌నిచేస్తోందని పేర్కొంది. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌‌ స్కాట్‌ స్పెన్సర్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: