ఆరోగ్యసేతు యాప్‌.. దీనికి సంబంధించి కొద్దిరోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఉద్యోగులంద‌రూ త‌ప్ప‌కుండా ఆరోగ్య సేతు యాప్‌ను త‌మ ఫోన్ల‌లో డౌన్లోడ్ చేసుకోవాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఈ యాప్‌కు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తుందంటే.. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంటే కరోనాకు సంబంధించిన సమస్త సమాచారంతోపాటు మీ పరిసరాల్లో ఎవరైనా కొవిడ్‌-19 తో బాధపడుతున్నవారు ఉంటే ఇట్టే కనిపెట్టేస్తుంది. అందుకనే ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, నోయిడా పోలీసులు మాత్రం ఒక అడుగు ముందుకేసి స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ ఉండాల్సిందేన‌ని హెచ్చరిస్తున్నారు.

 

ఈ యాప్‌ లేనివారికి వేయి రూపాయల జరిమానా గానీ, జైలుశిక్షగానీ విధిస్తున్నారు. నోయిడా, గ్రేటర్‌ నోయిడా రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్‌ఫోన్లను చెక్‌ చేస్తూ వారి వద్ద ఆరోగ్యసేతు యాప్‌ ఉన్నదీ, లేనిదీ చూస్తూ జరిమానా వేస్తున్నారు. నగరంలోకి వచ్చే వారికి కూడా ఇదే విధానం వర్తిస్తుందని చెప్తూ వారి ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. అయితే.. ఆరోగ్యసేతు యాప్‌ లేనివారికి ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం వేయి రూపాయల జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్నట్టు నోయిడా శాంతిభద్రతల డీసీపీ అఖిలేశ్‌ కుమార్‌ చెప్పారు. అయితే.. పోలీసులు ఒక విష‌యాన్ని సూటిగా చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నందునే ఈ విధానాలను పాటిస్తున్నామని, జరిమానాతో వేధించాలని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉద్యోగి సూచించిన ఉత్వర్తులను తప్పనిసరిగా పాటించాలని ఈ సెక్షన్‌ చెప్తున్నది. ఈ సెక్షన్‌ ప్రకారం ఉత్తర్వులను పాటించనివారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, వేయి రూపాయల జరిమానా విధిస్తారు. దీనిపై ప్ర‌జ‌ల నుంచి భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఈ యాప్‌పై రాహుల్‌గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇది వ్య‌క్త‌గ‌త స‌మాచారానికి భ‌ద్ర‌త‌లేద‌ని, ఇది మ‌న‌పై నిఘా ఉంచుతుందంటూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: