విశాఖ గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. సుమారు రాత్రి 3:30గంట‌ల స‌మయంలో ఈ ర‌సాయ‌న వాయువు లీకైన‌ట్లు తెలుస్తోంది. సుమారు గంట త‌ర్వాత అంటే 4:30గంట‌ల‌కు గానీ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. చుట్టుప‌క్కల ప్రాంతాల ప్ర‌జ‌లు నిద్ర‌మ‌త్తులోనే ఉండి ఈ ప్ర‌మాద‌క‌రవాయువును పీల్చుకున్నారు. అయితే.. ఒక్క‌సారిగా విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో ప్ర‌జ‌లు ప‌రుగులు తీశారు. మేఘాద్రిగ‌డ్డ వైపు ప‌రుగులు తీశారు. ఈ క్ర‌మంలో శ్వాస అంద‌క ప‌లువురు రోడ్ల‌పైనే ప‌డిపోయారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సుమారు ఆరు ప్రాంతాల‌ను ఖాళీ చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

 

ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి వేరే ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. వంద‌ల మందిని కేజీహెచ్‌తోపాటు ఇత‌ర ఆస్ప‌త్రుల‌ను త‌ర‌లించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. క‌లెక్ట‌ర్‌, మంత్రి అవంతి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. సుమారు 48గంట‌ల‌పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మ‌రోవైపు క‌లెక్ట‌ర్‌తో సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. వెంట‌నే వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. యంత్రాల‌ను ప్రారంభిస్తుండ‌గా మంట‌లు వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన‌ట్లు గుర్తించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. ఇందులో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: