విశాఖలోని ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్ర‌మాదంతో భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆర్ ఆర్ వెంక‌టాపురంతోపాటు దాని చుట్టుప‌క్క‌ల ఉన్న ఐదారు గ్రామాల ప్రజలు ఇళ్ల‌ను ఖాళీ చేశారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 8మంది మృతి చెందారని తెలిసింది. అయితే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లేందుకు తాజాగా కేంద్రం అనుమతి కోరారు. చంద్రబాబు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. కేంద్రం అనుమతిస్తే వెంటనే విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తుందా..?  లేదా.? అన్న‌ది టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.  

 

కాగా, విశాఖ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. *ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయి. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలి. ఈ విష వాయువు సుమారు 3 కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారిపోమయాయి. దీన్ని బట్టి చూస్తే ఆ విషవాయువు తీవ్రత ఏంటో తెలుస్తుంది. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించాలి. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరం. బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలి* అని బాబు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: