విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.  లీకైన గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లోకి వ్యాపించింది.  ఈ గ్యాస్ కారణంగా ఇప్పటికే 2000 మంది వరకు స్పృహతప్పి పడిపోయినట్టు సమాచారం. కొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు.  ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇంకా చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారని, వారంతా ఎలా ఉన్నారు అనే విషయం తెలియడం లేదని, అసలు బతికున్నారా లేదా అన్నది అనుమానమే అని స్థానికులు చెప్తున్నారు. 

 

అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు.  తాజాగా విశాఖ లో గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో దాదాపు 1500 ఇళ్లల్లో వారిని ఖాళీ చేయించామని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ఖాళీ చేయించిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.  ముగ్గురు బాధితులకు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నామని అన్నారు. కాగా, ఈ ఘటనలో బాధితులను పరామర్శించే నిమిత్తం వైజాగ్ కు సీఎం జగన్ బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించి 180 మంది బాధితులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని, మరో 40 మందిని అపోలో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: