ఒకే రోజు మూడు న‌గ‌రాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. జ‌నం భీతిల్లిపోయారు..! కేంద్రం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో మూసిన‌వేసిన ప‌రిశ్ర‌మ‌ల్లో తిరిగి కార్య‌క‌లాపాలు ప్రారంభించే క్ర‌మంలో భారీ ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖ‌లోని ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామ స‌మీపంలో ఉన్న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గురువారం తెల్ల‌వారు జామున ఒక్క‌సారిగా గ్యాస్ లీకేజీ కావ‌డంతో సుమారు ఐదారుగ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విశాఖ‌లో ఎటుచూసినా హృద‌య‌విదార‌క దృశ్యాలే క‌నిపించాయి. ఈ ఘ‌ట‌న‌తో సుమారు 11మంది మృతి చెందారు. వంద‌లాదిమంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అంత‌కుముందు ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలోని లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని  తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్‌ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్‌ మిల్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.

 

బుధవారం సాయంత్రం కార్మికులు ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. అలాగే.. తమిళనాడులో నైవేలీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్‌ ప్లాంట్‌ రెండో యూనిట్‌లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్‌ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి.ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్‌డౌన్‌ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: