ప్ర‌పంచాన్ని కుదిపే‌స్తున్న క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఇజ్రాయెల్ దేశం కీల‌క ముంద‌డుగు వేసింది. క‌రోనాకు యాంటీబాడీసీ త‌యారు చేసిన‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. క‌రోనా క‌ణాల‌ను యాంటీబాడీస్ నిర్వీర్యం చేస్తున్నాయ‌ని ఆ దేశం ప్ర‌క‌టించింది. తాజాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఇవే ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముందస్తుగా ప్లాస్మా సేకరణకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రెండు చోట్ల ప్లాస్మా సేకరణ చేయనున్నట్లు కోవిడ్‌-19 స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ నోడల్‌ అధికారి డా. ప్రభాకర్‌రెడ్డి ఇటీవ‌ల వెల్ల‌డించారు. తిరుపతి స్విమ్స్, కర్నూలు మెడికల్ కాలేజిలో ప్లాస్మా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి 14 రోజుల తర్వాత వారి ప్లాస్మా సేకరిస్తే, యాంటీ బాడీస్‌ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపతుందని చెప్పారు.

 

ఇప్పటివరకు కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమే చేస్తున్నామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇక్క‌డ ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్లాస్మా సేకరణ కరోనా బాధితులకు యంటీ బాడీస్‌ అభివృద్ధికి ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. ఇక సేకరించి ప్లాస్మాను -40 డిగ్రీల వద్ద ప్రిజర్వ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు 14 రోజులు తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానంచేయాల‌ని కూడా ఆయ‌న కోరారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఏపీలో కూడా క‌రోనాకు విరుగుడుగా యాంటీబాడీస్ త‌యారు చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: